సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు

సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు

సాధారణంగా కుంకుమ పువ్వు అనగానే కేవలం కశ్మీర్ వంటి అత్యంత శీతల వాతావరణం ఉండే ప్రదేశాల్లో పండే పంట అని మనందరికీ తెలిసిందే. అయితే ఈ పంటను తెలంగాణలోని సిద్ధిపేటలో పండిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి అద్భుతం సృష్టించారు. ఇంతకీ తెలంగాణలో కుంకుమ పువ్వు సాగు ఎలా జరుగుతుందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

కుంకుమ పువ్వు.. ఈ పేరు చెప్పగానే ఖరీదు ఎక్కువనే ఆలోచనలో మదిలోకి వస్తుంది. బంగారాన్ని విక్రయించినట్లు తులాల లెక్కన కుంకుమ పువ్వును విక్రయిస్తారంటేనే దీని ప్రత్యేకత ఏంటో చెప్పొచ్చు. మార్కెట్లో ఒక తులం కుంకుమ పువ్వు ఏకంగా రూ. 300 వరకు ఉంటుంది. ఇలాంటి కుంకుమ పువ్వు పంటను సాగు చేస్తే లాభాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అయితే ఇదేదో వరి, మొక్కజొన్న లాగా ఎక్కడ పడితే అక్కడ పండదు. ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లోనే కుంకుమ పువ్వు సాగు చేసే అవకాశం ఉంటుంది. కశ్మీర్‌ లాంటి అత్యంత చల్లటి ప్రదేశాల్లోనే ఈ కుంకు పువ్వు సాగు అవుతుంది. ఇంతటి ప్రత్యేకత ఉంటుంది కాబట్టే దీనికి విలువ. ఇక కుంకుమ పువ్వులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

కశ్మీర్‌, హిమాచల్ ప్రదేశ్‌ వంటి చల్లటి ప్రదేశాలలో మాత్రమే పండించే కశ్మీరీ కుంకుమ పువ్వును తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో పండిస్తున్నారు. తెలంగాణలో కుంకుమ పువ్వు సాగు ఎలా సాగుతోందనేగా మీ సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. సిద్దిపేట అర్బన్ మండలంలోని డిఎక్స్ఎన్ కంపెనీ కృత్రిమంగా చల్లటి ప్రదేశాన్ని సృష్టించి కుంకుమ పువ్వును సాగు చేస్తున్నారు.

ఇందుకోసం ఒక కోల్డ్ రూమ్ ఏర్పాటు చేసి.. కశ్మీర్‌ నుంచి సాఫ్రాన్ విత్తనాలు తీసుకువచ్చి, పంట వేశారు. కేవలం నాలుగు నెలల కాలవ్యవధిలో పంట చేతికి వచ్చింది. బయట మార్కెట్లో లభించే కుంకుమ పువ్వుతో పోలిస్తే కోల్డ్ రూమ్లో పండించిన కుంకుమపువ్వు ఎక్కువ నాణ్యతతో, ఎక్కువ సువాసన కలిగి ఉండడం విశేషం. పైలెట్ ప్రాజెక్టుగా ఒక కోల్డ్ రూమ్ లో మొదటిసారి పంట వేశారు. ఒక ఎకరం పొలంలో పండించే పంటను ఒక రూమ్ లో పండించవచ్చునని నిరూపించారు కంపెనీ వాళ్లు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేసి నాణ్యమైన కుంకుమ పువ్వును పండిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే త్వరలోనే మష్రూమ్ కల్టివేషన్ ప్రాజెక్టు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.

Please follow and like us:
తెలంగాణ వార్తలు